Breaking News:

సాహసం శ్వాసగా సాగిపో

చిత్రం: ‘సాహసం శ్వాసగా సాగిపో’ 

నటీనటులు: అక్కినేని నాగచైతన్య - మాంజిమా మోహన్ - బాబా సెహగల్ - డేనియల్ బాలాజి - రాకేందు మౌళి - నాగినీడు తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: డాన్ మాకార్థర్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
రచన - దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్

‘ఏమాయ చేసావె’ సినిమాతో మ్యాజిక్ చేసిన గౌతమ్ మీనన్.. మళ్లీ నాగచైతన్యతో సినిమా అనగానే భలే ఆసక్తి కలిగింది జనాల్లో. ఐతే వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనివార్య కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడి ప్రేక్షకుల్ని నిరీక్షణలో ఉంచింది. ఐతే ఎట్టకేలకు ఈ నిరీక్షణ ఫలించి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. మరి గౌతమ్-చైతూల మ్యాజికల్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి సినిమాను అందించిందో చూద్దాం పదండి.

కథ: 

ఎంబీఏ పూర్తి చేసి స్నేహితులతో సరదాగా గడిపేస్తున్న ఓ కుర్రాడు.. తన ఇంటికి వచ్చిన చెల్లెలి స్నేహితురాల్ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తర్వాత తన ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ గా దిగడంతో తనతో అతడికి స్నేహం కుదురుతుంది. కొన్నాళ్లకు ఆ స్నేహం చిక్కబడుతుంది. ఇద్దరూ కలిసి ఓ ట్రిప్ కూడా వేస్తారు. ఆ ఇద్దరూ మరింత దగ్గరయ్యే తరుణంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ పరిణామంతో వాళ్లిద్దరి జీవితాల్లో అలజడి మొదలవుతుంది. ఇంతకీ ఈ అలజడికి కారణమేంటి.. ఆ అమ్మాయి ద్వారా తనకు ఎదురైన సమస్యను ఆ కుర్రాడు ఎలా పరిష్కరించుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

గౌతమ్ మీనన్ ఒక విలక్షణమైన దర్శకుడు. అతను ఏమాయ చేసావె.. ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి క్లాస్ లవ్ స్టోరీలు తీస్తాడు. అలాగే ఘర్షణ.. రాఘవన్ లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలూ తీస్తాడు. ఈ రెండు రకాల సినిమాల్లోనూ గౌతమ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అతను తొలిసారి రొమాన్స్.. యాక్షన్ కలగలిపి చేసిన సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఐతే ఈ రెండు జానర్లనూ మిక్స్ చేయడంలో గౌతమ్ కొంచెం బ్యాలెన్స్ తప్పాడు. రొమాంటిక్ ట్రాక్ వరకు గౌతమ్ మార్కుతో చాలా అందంగా.. ఆహ్లాదంగా అనిపించే ‘సాహసం శ్వాసగా సాగిపో’.. సీరియస్ మోడ్లోకి వెళ్లాక కొంచెం తడబడుతూ సాగుతుంది. కానీ ఓవరాల్ గా ‘సాహసం శ్వాసగా సాగిపో’ వైవిధ్యమైన.. మంచి ప్రయత్నమే.

‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో తొలి 50 నిమిషాల రొమాంటిక్ ట్రాక్ ప్రధాన ఆకర్షణ. గౌతమ్ మీనన్ మరోసారి తనదైన శైలిలో కథనాన్ని నడిపిస్తూ.. యువ హృదయాలకు గిలిగిలింతలు పెడతాడు. ‘ఏమాయ చేసావె’ ఫ్లేవర్ ను గుర్తుకు తెస్తూ ఆహ్లాదంగా సాగిపోతుంది రొమాంటిక్ ట్రాక్. గౌతమ్ మీనన్ కు సొంతంగా ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో.. అతనెన్ని లవ్ స్టోరీలు చూశాడో కానీ.. ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య పరిచయం.. స్నేహం.. ప్రేమ  ప్రేమ వ్యవహారాన్ని ఆహ్లాదకరంగా తెరకెక్కించడంలో..  ఫీల్ తీసుకురావడంలో గౌతమ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రొమాంటిక్ ట్రాక్ సాగుతున్నంతసేపూ ఒక ఫీల్ ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతూ ఉంటుంది. సినిమాలో ఉన్న ఐదు పాటలూ ఈ 50 నిమిషాల్లో వచ్చేసినా ఇబ్బందిగా అనిపించకపోవడం విశేషమే. ఈ రొమాంటిక్ ట్రాక్ అంతటా మ్యూజికల్.. విజువల్ ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. సున్నితమైన హాస్యంతో.. ఆహ్లాదంగా సాగిపోయే రొమాంటిక్ ట్రాక్ కు రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్.. డాన్ మాకార్థర్ విజువల్స్ పెద్ద బలంగా నిలిచాయి. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా చక్కగా కుదరడంతో రొమాంటిక్ ట్రాక్ బాగా పండింది. తొలి 50 నిమిషాలు ఎలా గడుస్తాయో తెలియనట్లుగా సాగిపోతుంది ఈ ట్రాక్. ఐతే సినిమా యాక్షన్ మోడ్లోకి వెళ్లాకే కొంచెం గతి తప్పుతుంది.

యాక్షన్ కథల్ని రియలిస్టిక్ అప్రోచ్ తో.. ఇంటెన్సిటీతో చెప్పడంలో తన ప్రత్యేకత చూపించే గౌతమ్.. ఈసారి మామూలు కమర్షియల్ దర్శకుల బాటలో నడవడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక మామూలు కుర్రాడి జీవితంలో ఓ అనూహ్య సంఘటన జరిగితే ఎలా ఎదుర్కొంటాడు అన్నది ‘సాహసం శ్వాసగా సాగిపో’ కథను మలుపు తిప్పే అంశం. ఆ అంశాన్ని అంత ఎఫెక్టివ్ గా డీల్ చేయలేకపోయాడు గౌతమ్. హీరో హీరోయిన్ల మీదికి పోలీసులు.. రౌడీలు పదే పదే దాడి చేయడం.. ఒకరినొకరు కాల్చుకోవడం.. ఈ సన్నివేశాలే చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. సస్పెన్స్ వీడటానికి చాలా సమయం పట్టేస్తుంది. అటు పోలీసులు.. ఇటు కథానాయకుడు ఇష్టానుసారం మనుషుల్ని చంపుకుంటూ వెళ్లిపోవడం.. ఎవరికీ ఏమీ కాకపోవడం.. ఎక్కడా ఒక సిస్టమ్ అన్నదే లేనట్లుగా కథ సాగిపోవడం.. ఇదంతా చూస్తే ఇది గౌతమ్ మీనన్ సినిమానేనా అన్న సందేహం కలుగుతుంది. మామూలుగా గౌతమ్ మీనన్ సినిమాలు లాజికల్ గా ఉంటాయి. ఇలాంటి లూప్ హోల్స్ కనిపించవు.

దీనికి తోడు క్లైమాక్స్ లో ఇచ్చిన కమర్షియల్ టచ్ అయితే.. అసలేమాత్రం గౌతమ్ మీనన్ సినిమాల్లో ఊహించలేనిది. హీరో పాత్ర విషయంలో ట్విస్టు మాస్ ప్రేక్షకుల్ని మెప్పించొచ్చేమో కానీ.. గౌతమ్ అభిమానుల్ని మాత్రం నిరాశ పరుస్తుంది. హీరో చివర్లో రివీల్ చేసే సస్పెన్స్ స్టోరీ దాదాపుగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలోని హీరోయిన్ కథను గుర్తుకు తెస్తుంది. యాక్షన్ ఎపిసోడ్ మరీ బోర్ కొట్టించేయదు కానీ.. అనుకున్నంత ఆసక్తికరంగా అయితే సాగదు. రెండో అర్ధంలో సాగతీత వల్ల చివరికి వచ్చేసరికి చాలా పెద్ద సినిమా చూసిన భావన కలుగుతుంది. ఈ యాక్షన్ ఏమీ లేకుండా ‘ఏమాయ చేసావె’ తరహాలో ఒక ప్రేమకథనే చూపించి ఉంటే బావుండేదన్న ఫీలింగ్ కలిగిస్తుంది ‘సాహసం శ్వాసగా సాగిపో’. యాక్షన్ పార్ట్ లోనూ మెప్పించే సన్నివేశాలు లేకపోలేదు. కానీ మొత్తంగా ఈ ఎపిసోడ్ నిరాశ పరిచేదే. ప్రథమార్ధంలో ఉన్న మంచి ఫీలింగ్ ను ఇది తగ్గిస్తుంది. ఓవరాల్ గా ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఓకే అనిపిస్తుంది.

నటీనటులు: 

‘ఏమాయ చేసావె’కు ‘సాహసం శ్వాసగా సాగిపో’కు నాగచైతన్యలో వచ్చిన మార్పు.. పరిణతి స్పష్టంగా కనిపిస్తుంది. చైతూ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటి. ఇటు రొమాంటిక్ ట్రాక్.. అటు యాక్షన్ పార్ట్ రెండింట్లోనూ చైతూ మెప్పించాడు. గౌతమ్ సినిమాలకు తగ్గట్లుగా సటిల్ యాక్టింగ్ తో చైతూ ఆకట్టుకున్నాడు. అతడి లుక్ కూడా బాగుంది. మాంజిమా మోహన్ నటన.. హావభావాల పరంగా మెప్పించింది కానీ.. గ్లామర్ పరంగా మాత్రం నిరాశ పరుస్తుంది. రొమాంటిక్ ట్రాక్ చూస్తున్నంతసేపూ ఇంకా అందమైన హీరోయిన్ అయితే బాగుండన్న పీలింగ్ కలుగుతుంది. ఈ సందర్భంలో ‘ఏమాయ చేసావె’లో సమంత గుర్తు రాక మానదు. హీరో ఫ్రెండు పాత్రలో రాకేందు మౌళి పర్వాలేదు. విలన్లుగా బాబా సెహగల్.. డేనియల్ బాలాజి జస్ట్ ఓకే అనిపిస్తారు.

సాంకేతికవర్గం: 

ఎ.ఆర్.రెహమాన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’కు బ్యాక్ బోన్ లాగా నిలిచాడు. ఆయన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రొమాంటిక్ ట్రాక్ అంతటా రెహమాన్ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. రెహమాన్ లేకుంటే ఆ ఎపిసోడ్ అంత ఆహ్లాదంగా ఉండేది కాదేమో అనిపిస్తుంది. ద్వితీయార్దంలో హీరోయిన్ ప్రాణాలతో పోరాడే సన్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్ రెహమాన్ ప్రత్యేకతను చాటుతుంది. డాన్ మాకార్థర్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. సినిమా అంతటా ఒక థీమ్ కనిపిస్తుంది. గౌతమ్ టేస్టుకు తగ్గ ఔట్ పుట్ ఇచ్చాడతను. మాటలు సందర్భోచితంగా.. సింపుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. 

ఇక గౌతమ్ మీనన్ విషయానికి వస్తే.. సినిమాలో ప్రథమార్ధం వరకు ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్లిపోమాకే పాటను ప్లేస్ చేసిన తీరు.. దాన్ని తెరకెక్కించిన వైనం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ముందు ఆ పాట కొంచెం అదోలా అనిపించినా సరే.. ఆ తర్వాత కథ సాగే తీరును బట్టి ఆ పాటను అలా తీయడంలో గౌతమ్ ప్రత్యేకత అర్థమవుతుంది. ఐతే ద్వితీయార్ధంలో ఒక మామూలు కమర్షియల్ డైరెక్టర్ లాగా గౌతమ్ ఆలోచించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. తాను తీసిన యాక్షన్ సినిమాల్లో లాగా ఉత్కంఠభరితంగా రెండో అర్ధాన్ని నడిపించలేకపోయాడు గౌతమ్. ముందు వావ్ అనిపించిన గౌతమ్. చివరికి వచ్చేసరికి ఒక మామూలు దర్శకుడిలా మారిపోయాడు.

చివరగా: సాహసం శ్వాసగా సాగిపో.. సగం ఆహ్లాదం.. సగం అలజడి!!

రేటింగ్: 2.75 

Last modified onFriday, 09 December 2016 10:23

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses