Breaking News:

రెమో

చిత్రం : ‘రెమో’ 

నటీనటులు: శివ కార్తికేయన్ - కీర్తి సురేష్ - శరణ్య - సతీష్ - మొట్ట రాజేంద్రన్ - యోగి బాబు - కె.ఎస్.రవికుమార్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్
నిర్మాత: ఆర్.డి.రాజా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: భాగ్యరాజ్ కన్నన్

టీవీ ప్రెజెంటర్ గా కెరీర్ ఆరంభించి.. అనుకోకుండా హీరోగా మారి.. మూణ్నాలుగేళ్లలోనూ తమిళ సినిమాల్లో అనూహ్యమైన స్థాయికి చేరుకున్నాడు శివ కార్తికేయన్. అతను కథానాయకుడిగా నటించిన ‘రెమో’ సినిమా దసరాకు మాంచి హైప్ మధ్య విడుదలై బాగానే సక్సెస్ అయింది. తెలుగులో దిల్ రాజు బేనర్ ద్వారా మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయడంతో ఇక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తించగలిగింది. మరి తెలుగులో శివకార్తికేయన్ అరంగేట్ర సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: 

ఎస్కే (శివ కార్తికేయన్)కు నటుడు కావాలన్నది ఆశయం. తల్లి అతణ్ని ప్రోత్సహించకపోయినా.. నటుడిగా అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకున్నా అతను వెనక్కి తగ్గడు. ఇలాంటి సమయంలోనే కావ్య (కీర్తి సురేష్) అనే అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు ఎస్కే. కానీ ఆ అమ్మాయికి అప్పటికే నిశ్చితార్థం అయిపోయిందని తెలిసి నిరాశలో కూరుకుపోతాడు. తర్వాత ఓ సినిమా అవకాశం కోసం నర్సు వేషంలో వెళ్లి తిరిగి వస్తుండగా.. కావ్యకు అదే వేషంలో పరిచయమవుతాడు ఎస్కే. దీంతో అతడిలో మళ్లీ ఆశ మొదలవుతుంది. మరి అప్పటికే నిశ్చితార్థం అయిన కావ్యను తన వైపు తిప్పుకోవడానికి ఎస్కే ఏ మార్గం ఎంచుకున్నాడు.. ఆమె మనసును ఎలా మార్చాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

ఆ మధ్య మన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ..  తన సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణుల విషయంలో అసలేమాత్రం రాజీ పడనని.. స్క్రిప్టు పరంగా తన వైపు నుంచి ఏవైనా లోపాలున్నా టెక్నీషియన్స్ వాటిని కప్పిపుచ్చి సినిమాను నిలబెడతారని చెప్పాడు. ‘రెమో’ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ కూడా దాదాపుగా ఇలాగే ఆలోచించినట్లున్నాడు. ‘రెమో’ కథాకథనాల్లో బలం తక్కువైనా సరే.. నటీనటులు..  సాంకేతిక నిపుణులు బలంగా నిలిచి.. మంచి నిర్మాణ విలువలు కూడా తోడై ఈ చిత్రం కలర్ ఫుల్ గా తయారైంది.

‘రెమో’ కథకథనాల్లో కానీ.. సన్నివేశాల్లో కానీ.. ఎక్కడా ‘వావ్’ అనిపించే మూమెంట్ ఏదీ లేదు. కొత్తదనం అన్నది కాగడా వేసి వెతికినా కనిపించదు. ఈ కథ పదుల సంఖ్యలో సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. ప్రతి సన్నివేశం కూడా ఇప్పటికే చూసినట్లే ఉంటుంది. కాకపోతే పి.సి.శ్రీరామ్ కెమెరా మాయాజాలం వల్ల తెర చాలా కలర్ ఫుల్ గా.. ప్లెజెంట్ గా కనిపిస్తుంటే.. అనిరుధ్ సందర్భోచితమైన బ్యాగ్రౌండ్ స్కోర్.. పాటలతో ఒక ఫీల్ ఇస్తుంటే.. శివకార్తికేయన్-కీర్తి సురేష్ ల చక్కటి జోడీ కనువిందు చేస్తుంటే.. అలా అలా సన్నివేశాలు సాగిపోతుంటాయి. సినిమా ముందుకెళ్లిపోతుంటుంది.

హీరో అమ్మాయి వేషంలోకి మారి హీరోయిన్ మనసు మార్చడం అన్నది ‘భామనే సత్యభామనే’లోనే చూశాం. అందులో పెళ్లయ్యాక తన నుంచి విడిపోయిన భార్య మనసు హీరో మారిస్తే.. ఇక్కడ వేరొకరితో ఎంగేజ్ అయిన అమ్మాయిని తన వైపు తిప్పుకుంటాడు కథానాయకుడు. కథాకథనాల్లాగే ఇందులో పాత్రలు కూడా ఒక టెంప్లేట్ ప్రకారం సాగిపోతాయి. ఓవైపు అమ్మాయి వేషంలో హీరోయిన్ని కన్ఫ్యూజ్ చేయడం.. మరోవైపు అబ్బాయిగా ఆమె వెంటపడి తన మనసు గెలిచే ప్రయత్నాలు చేయడం.. హీరోయిన్ నెమ్మదిగా తాను చేసుకోవాల్సిన వాడి నుంచి దూరం జరిగి హీరో వైపు మొగ్గడం.. చివర్లో కథ ఎమోషనల్ టర్న్ తీసుకుని సుఖాంతం కావడం.. ఇలా అంతా ప్రేక్షకుడి అంచనాల ప్రకారం సాగిపోతుంది ‘రెమో’.

సినిమా ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ మీదే నడుస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య.. హీరోకు అతడి తల్లికి.. స్నేహితులకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్టైన్ చేస్తాయి. ప్రధమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. మరీ రొటీన్ గా సాగిపోతుంది. క్లైమాక్స్ లో హీరో గుట్టు రట్టయ్యే సన్నివేశం బాగా పండింది. సినిమాలో హీరో కుటుంబ ఆర్థిక పరిస్థితేంటో చూపించరు. అతను జీవితంలో అసలేమాత్రం స్థిరపడి ఉండడు. కానీ ఎప్పుడూ ప్రేమ ప్రేమ అని తిరుగుతూ.. ప్రేయసిని మెప్పించడానికి ఒక కోటీశ్వరుడి తరహాలో వ్యవహారాలు నడుపుతుంటాడు. అమ్మాయి వేషంలో ఒకబ్బాయి హాస్పిటల్లో నెట్టుకొచ్చే విధానం కూడా సిల్లీగా ఉంటుంది. పాత్రలు.. సన్నివేశాలు అన్నీ కూడా ఇలా లాజిక్ లేకుండానే ఉంటాయి.

‘రెమో’ చూస్తుంటే టైంపాస్ విషయంలో పెద్దగా ఇబ్బందిగా అనిపించదు కానీ.. కథాకథనాల్లో ఏ ప్రత్యేకతా లేకపోవడం.. చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సినిమాటిగ్గా సినిమా సాగిపోవడం నిరాశ పరుస్తుంది. తమిళ సినిమా కదా.. దిల్ రాజు రిలీజ్ చేశాడు కదా.. ఇంత ప్రచారం చేశారు కదా.. ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది.. ఎక్కడో ఒకచోట సర్ప్రైజ్ ఇస్తారు అని ఆశిస్తే.. చివరి వరకు అలా ఎదురు చూస్తూ ఉండాల్సిందే. కానీ కంటెంట్ ఎలా ఉన్నా సరే.. ‘రెమో’ ఆరంభం నుంచి చివరిదాకా కంటికి.. చెవులకు ఇంపుగా మాత్రం అనిపిస్తుంది. 

నటీనటులు: 

శివ కార్తికేయన్ ను చూస్తే మన నాని లాగా ఫెమిలియర్ గా అనిపిస్తాడు. పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. తన చలాకీ నటనతో మెప్పించాడు శివకార్తికేయన్. తమిళంలో అతడికి కొంచెం స్టార్ ఇమేజ్ ఉండటం వల్ల సినిమాలో కొన్ని చోట్ల ఇచ్చిన బిల్డప్.. బ్యాగ్రౌండ్ స్కోర్ అదీ మనకు కొంచెం అతిగా అనిపించే అవకాశం ఉంది. ఐతే శివ కార్తికేయన్ మంచి ఈజ్ ఉన్న నటుడు అని ఈ సినిమాతో మన ప్రేక్షకులకూ అర్థమవుతుంది. ఇటు కుర్రాడిగా.. అటు అమ్మాయిగా.. రెండు పాత్రల్లోనూ శివ మెప్పించాడు. కాకపోతే అమ్మాయి వేషంలో బాడీ లాంగ్వేజ్ కొంచెం మార్చుకోవాల్సింది. కీర్తి సురేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కుర్రాళ్లు ఆమె కోసమే సినిమాకు వెళ్లిపోవచ్చు. నటన మామూలే కానీ.. తన క్యూట్ నెస్ ఆకట్టుకుంటుంది. ఆమె కనిపించిన ప్రతిసారీ ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఆమె కళ్లు.. తన హావభావాలు కట్టిపడేస్తాయి. శివ-కీర్తి జోడీ కూడా బాగుంది. ఓకే ఓకే.. రఘువరన్ బీటెక్ లాంటి సినిమాల తర్వాత శరణ్యను ఈ చిత్రంలో చూశాక.. ఇలాంటి హీరో తల్లి పాత్రల్లో మనకు కూడా బాగానే అలవాటైపోతుంది. సతీష్.. మొట్ట రాజేంద్రన్.. యోగి బాబు.. పర్వాలేదు. ఓ మోస్తరుగా నవ్వించారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ నిజ జీవిత పాత్రలో కనిపించాడిందులో.

సాంకేతికవర్గం: 

‘రెమో’కు సాంకేతిక నిపుణులు పెద్ద బలం. పి.సి.శ్రీరామ్ ఇలాంటి రొటీన్ సినిమాలకు ఛాయాగ్రహణం అందించడమే ఆశ్చర్యం. కానీ ఆయన ఇందులోనూ తన ప్రత్యేకత చూపించారు. చాలా మామూలు సన్నివేశాలు కూడా ప్లెజెంట్ ఫీలింగ్ కలిగించాయంటే అందుకు ఆయన కెమెరా పనితనం ఒక కారణం. అనిరుధ్ కూడా తన వంతుగా సినిమాకు బాగా ఉపయోగపడ్డాడు. పాటలు.. నేపథ్య సంగీతం.. రెండూ బాగా కుదిరాయి. సినిమాను ముందుకు నడిపించాయి. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడకుండా బాగా ఖర్చు చేశారు. డబ్బింగ్ విషయంలో కూడా క్వాలిటీ చూపించారు. ఇక దర్శకుడు భాగ్యరాజ్ కన్ననే సాంకేతిక నిపుణుల్లో తక్కువ స్కోర్ చేస్తాడు. అతను సేఫ్ గేమ్ ఆడాడు. ఒక ఫార్ములా ప్రకారం సినిమాను నడిపించేశాడు. రొటీనే అయినా కొన్ని కామెడీ సీన్స్.. లవ్ సీన్స్ లో మెప్పించాడు. ఐతే నటీనటుల్ని.. సాంకేతిక నిపుణుల్ని సరిగ్గా వాడుకుని వారి నుంచి మంచి ఔట్ పుట్ తీసుకున్నాడు. ఈ విషయంలో అతడికి ఉన్న క్లారిటీ.. కాన్ఫిడెన్స్ తెరమీద కనిపిస్తుంది.

చివరగా: రెమో.. కంటెంట్ తక్కువే కానీ.. కలర్ ఫుల్లే

రేటింగ్: 2.5

Last modified onFriday, 09 December 2016 10:19

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses