Breaking News:
Super User

Super User

వంగవీటి

చిత్రం : ‘వంగవీటి’ 

నటీనటులు: సందీప్ కుమార్ - నైనా గంగూలీ - శ్రీతేజ్ - వంశీ చాగంటి - కౌటిల్య తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్ - దిలీప్ వర్మ - సూర్య చౌదరి
రచన: రాధాకృష్ణ - చైతన్య ప్రసాద్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

‘రక్తచరిత్ర’ తర్వాత రామ్ గోపాల్ వర్మ నుంచి మళ్లీ ఆ స్థాయి సినిమా రాలేదు. ‘వంగవీటి’ ఆ లోటును తీర్చే సినిమాలా కనిపించింది. ‘రక్తచరిత్ర’కు అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల్ని కథావస్తువుగా తీసుకున్న వర్మ.. ఈసారి ఒకప్పటి బెజవాడ రౌడీ రాజకీయాల్ని ఎంచుకున్నాడు. ఎంతో ఆసక్తిని.. ఉత్కంఠను రేకెత్తించిన ఈ వివాదాస్పద చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: విజయవాడలో చిన్న రౌడీగా ప్రస్థానం ఆరంభించి.. కమ్యూనిస్టు నేత వెంకటరత్నం అండతో నగరాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు రాధా (సందీప్ కుమార్). రాధా ఎదుగుదల వెంకటరత్నానికి కంటగింపు అవుతుంది. అతణ్ని అవమానిస్తాడు. దీంతో రాధా.. వెంకటరత్నాన్ని మట్టుబెట్టి విజయవాడను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. ఆపై రాధాకు.. అన్నదమ్ములైన గాంధీ (కౌటిల్య).. నెహ్రూ (శ్రీతేజ్) దగ్గరవుతారు. ఇంతలో తమ నేతను మట్టుబెట్టాడన్న కోపంతో వెంకటరత్నం పార్టీ మనుషులు రాధాను చంపేస్తారు. దీంతో రాధా తమ్ముడైన రంగా అతడి స్థానంలోకి వస్తాడు. అక్కడి నుంచి పరిస్థితులు ఎలా మలుపు తిరిగాయి.. రంగా ప్రస్థానం ఎలా సాగింది.. ఎలా ముగిసింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: హింసతో ముడిపడిన నిజ జీవిత గాథల్ని రసవత్తరంగా తెరకెక్కించడంలో వర్మ శైలే వేరు. వాస్తవ కథలో ఎంత విషయం ఉంటే.. దాన్ని అంత ఆసక్తికరంగా చెప్పడంలో వర్మ నేర్పరి. ‘వంగవీటి’ వాస్తవ కథలో విషయం చాలానే ఉన్నా.. వర్మ చాలా కీలకమైన విషయాల్ని దాచిపెట్టేసి.. పైపై మెరుపులతోనే సరిపెట్టాడు. టేకింగ్ పరంగా మాత్రం ఇందులో వర్మ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మర్డర్ సీన్స్ ను ఉత్కంఠభరితంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కించడంలో వర్మ ప్రత్యేకత తెలుస్తుంది. ఒక హత్య జరిగే తీరును వర్మ కంటే బాగా ఇంకెవరూ చూపించలేరేమో అనిపిస్తాయి ఇందులోని సన్నివేశాలు. కాకపోతే ‘వంగవీటి’ సినిమా అంతటా కూడా ఈ హత్యలే కనిపిస్తాయి. ఆ హత్యలకు అటు ఇటు జరిగిన విషయాలన్నింటినీ వర్మ విస్మరించడం ఈ చిత్రంలోని ప్రధాన బలహీనత.

తెరమీద మర్డర్ సీన్లను రసవత్తరంగా చిత్రీకరించడం తన బలం కాబట్టి.. వర్మ ప్రధానంగా వాటి మీదే దృష్టిపెట్టినట్లున్నాడు. బహుశా చాలా ఏళ్ల పాటు జరిగిన కథను రెండున్నర గంటల్లో చెప్పేటపుడు అన్ని అంశాల్నీ కవర్ చేయడం సాధ్యం కాదని.. అదే సమయంలో తాను ఎంచుకున్న కథలోని ఏ హత్యనూ అతను విస్మరించలేడు కాబట్టి వాటి మీదే ఫోకస్ పెట్టినట్లున్నాడు వర్మ. తెరమీద రక్తపాతాన్ని చూపించడాన్ని అమితంగా ఇష్టపడే వర్మ.. తెరమీద ఒక్కో మర్డర్ ను తనివితీరేలా డీటైల్డ్ గా చూపించడంతో చాలా సమయం ఖర్చయిపోయింది. ఒక హత్యకు నాంది.. దాని తాలూకు ప్రణాళిక.. అమలు.. ఇలా ఒక్కో హత్యకు సంబంధించిన వ్యవహారం ఒకదాని తర్వాత ఒకటి సాగిపోతాయి.

ఆరంభంలో వెంకటరత్నం ఎపిసోడ్ ఆసక్తికరంగా మొదలై.. వర్మ ముద్ర స్పష్టంగా కనిపించే మర్డర్ సీన్ తో ముగుస్తుంది. ఈ హత్యను చిత్రీకరించిన తీరు ‘వావ్’ అనిపిస్తుంది. ఐతే ఆ తర్వాత ఇలాంటి హత్యలు చూస్తూ చూస్తూ వెళ్తుంటే బోర్ కొట్టేస్తుంది. ఆరంభంలో ఉన్నంత గ్రిప్పింగ్ గా ఆ తర్వాతి సన్నివేశాలుండవు. ఇలాంటి సినిమాలో కథానాయికకు ఒక ఇంట్రో సాంగ్.. పెళ్లి పాట లాంటివి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో వర్మకే తెలియాలి. బ్యాగ్రౌండ్లో వచ్చే ‘మరణం’ లాంటి ఒకట్రెండు పాటలు ఓకే కానీ.. మిగతా పాటలు సినిమాకు స్పీడ్ బ్రేకర్లయ్యాయి. టెంపోను దెబ్బ తీశాయి. కథలో హత్యలు తప్ప ఇంకే మలుపులూ కనిపించవు. రాజకీయ అంశాలు.. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లోతుల్లోకి వెళ్లలేదు. వంగవీటి.. దేవినేని కుటుంబాల్లో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే విషయంలో ఒక స్టాండ్ ఏమీ తీసుకోకుండా బ్యాలెన్స్ పాటించాడు వర్మ. అలాగే ప్రధాన పాత్రలకు సంబంధించి లోతుల్లోకి కూడా వెళ్లలేదు. వివాదాస్పద అంశాల్ని దాదాపుగా కప్పెట్టేశాడు. చివర్లో రంగా హత్యకు సంబంధించి ప్లానింగ్ ఎలా జరిగింది.. అందులో ఎవరి ప్రమేయం ఉందన్నది మాత్రం చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే రంగా హత్యతో ముగిసే క్లైమాక్స్ అనుకున్నంత డ్రామా.. ఉత్కంఠ లేదు.

టేకింగ్ పరంగా ప్రతి సన్నివేశంలోనూ వర్మ ముద్ర కనిపిస్తుంది. వర్మ మార్కు కెమెరా యాంగిల్స్.. సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ఒకప్పటి విజయవాడ వాతావరణాన్ని సాధ్యమైనంత మేర చూపించే ప్రయత్నం చేశాడు. వరుస హత్యలు మొహం మొత్తేలా చేసినా.. టేకింగ్ పరంగా ఆ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. సినిమాలో అక్కడక్కడా వర్మ మార్కు చమక్కులు కనిపిస్తాయి. రాధా మర్డర్ ప్లాన్ జరుగుతున్నపుడు ‘‘రాధా ఎవరో ఎలా గుర్తుపట్టాలి’’ అని అడిగితే.. ‘‘మీలో ఎవరైనా ఆ గుంపులో వాళ్లకు నమస్కారం పెట్టండి. ఎవరు తిరిగి నమస్కారం పెడితే వాడే రాధా’’ అని చెప్పే సీన్ అందుకు ఓ ఉదాహరణ. చివర్లో రంగా మరణం తర్వాత కెమెరాను వెనుక వైపున్న దుర్గమ్మ వైపు తీసుకెళ్లి వాయిస్ ఓవర్ తో ఇచ్చిన ముగింపులోనూ వర్మ ముద్ర కనిపిస్తుంది.

ఒక హత్య దానికి ప్రతీకారం.. మళ్లీ ఇంకో హత్య దానికి ప్రతీకారం.. ఇలా సిరీస్ ఆఫ్ మర్డర్స్ లాగా సాగిపోతుంది ‘వంగవీటి’. అంతే తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. పాత్రల లోతుల్లోకి వెళ్లలేదు. ‘రక్తచరిత్ర’లో బుక్కారెడ్డి తరహాలో విలక్షణమైన.. సినిమాను నిలబెట్టే బలమైన పాత్ర లేకపోవడం ‘వంగవీటి’ బలహీనత. వాస్తవంగా రాధాతో పోలిస్తే.. రంగానే పెద్ద లీడర్. ఐతే సినిమాలో రాధా పాత్ర కాసేపే ఉన్నా బాగా ఎలివేట్ అయింది కానీ.. రంగా పాత్రకు స్క్రీన్ టైం ఎక్కువున్నప్పటికీ ఆ పాత్ర అనుకున్నంతగా పండలేదు. రంగా పాత్రను సరిగా బిల్డ్ చేయకపోవడం.. అతడి ఎదుగుదలను సరిగా చూపించకపోవడమే దీనికి కారణం కావచ్చు. ఓవరాల్ గా ‘వంగవీటి’ వర్మ తీసిన గత కొన్ని సినిమాల కంటే మెరుగనిపిస్తుంది తప్ప ఆయన తీసిన ‘వన్ ఆఫ్ ద బెస్ట్’ సినిమాల్లో ఒకటి కాదు. ఆయన అన్నట్లు ‘ది బెస్ట్’ అసలే కాదు.

నటీనటులు: సందీప్ కుమార్ రాధా.. రంగా పాత్రలు రెండింట్లోనూ సులువుగా ఒదిగిపోయాడు. తక్కువ నిడివిలో ముగిసిపోయే రాధా పాత్రలో అతను ఇంటెన్సిటీ చూపించాడు. క్లోజప్ షాట్లలో అతను ఇచ్చిన హావభావాలు ఆకట్టుకుంటాయి. స్టేచర్ ఉన్న పాత్రల్ని కొత్తవాడైనా బెరుకు లేకుండా కాన్ఫిడెంట్ గా చేశాడతను. కానీ రెండు పాత్రల్లో వైవిధ్యం మాత్రం చూపించలేకపోయడు. సినిమాలో మిగతా నటీనటులందరూ కూడా బాగానే చేశారు. సాఫ్ట్ గా కనిపించే వంశీ చాగంటి.. దేవినేని మురళి పాత్రలో ఆశ్చర్యపరిచాడు. పాత్ర తాలూకు మార్పుల్ని అతను చక్కగా చూపించాడు. నెహ్రూ పాత్రలో శ్రీతేజ్ కూడా ఆకట్టుకున్నాడు. నైనా గంగూలీ.. కౌటిల్య కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం: వర్మ సినిమా అంటే.. సాంకేతిక నిపుణులంతా ఆయన స్టయిల్లో పని చేయాల్సిందే. ‘వంగవీటి’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. సినిమాకు ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పని చేసినా.. యూనిఫార్మిటీ కనిపిస్తుంది. దాన్ని బట్టే అందరూ వర్మ శైలిలో పని చేశారని అర్థమవుతుంది. వర్మ మార్కు కెమెరా యాంగిల్స్.. ఏరియల్ షాట్స్ ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రవిశంకర్ మ్యూజిక్ ఓకే. గత సినిమాలతో పోలిస్తే నేపథ్య సంగీతంలో లౌడ్ నెస్ కొంచెం తగ్గించాడు. ‘మరణం’ సాంగ్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. మాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా సంక్షిప్తంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే. ‘‘అవసరం వందేళ్లకు సరిపడా అనుభవాన్ని నేర్పిస్తుంది’’ తరహా ఫిలసాఫికల్ మాటలు ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడిగా వర్మకు టేకింగ్ పరంగా వర్మకు మంచి మార్కులు పడతాయి కానీ.. జనాలు ఆశించినంత బోల్డ్ గా.. వివరంగా.. ఆసక్తికరంగా వర్మ ‘వంగవీటి’ కథను చెప్పలేకపోయాడు.

చివరగా: వంగవీటి.. టేకింగ్ ఓకే.. డెప్త్ లేదు..మర్డర్.. మర్డర్.. మర్డర్

రేటింగ్: 2.5/5

పిట్టగోడ

చిత్రం : ‘పిట్టగోడ’ 

నటీనటులు: విశ్వదేవ్ రాచకొండ - పునర్ణవి - జబర్దస్త్ రాజు - ఉయ్యాల జంపాల రాజు - శివ ఆర్.ఎస్ - శ్రీకాంత్ ఆర్.ఎన్ తదితరులు 
సంగీతం: ప్రాణం కమలాకర్
ఛాయాగ్రహణం: ఉదయి
స్క్రీన్ ప్లే: రామ్మోహన్
నిర్మాత: రామ్మోహన్
కథ - మాటలు - దర్శకత్వం: అనుదీప్

అష్టాచెమ్మా.. గోల్కొండ హైస్కూల్.. ఉయ్యాల జంపాల లాంటి వైవిధ్యమైన సినిమాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు రామ్మోహన్. కొత్త టాలెంటుని ప్రోత్సహించడానికి ముందుండే రామ్మోహన్.. ఈసారి కూడా అదే బాటలో ‘పిట్టగోడ’ అనే సినిమాను నిర్మించాడు. అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రోమోలతో బాగానే ఆసక్తి రేకెత్తించింది. మరి సినిమా ఆ ఆసక్తిని నిలబెట్టిందో లేదో చూద్దాం పదండి.

కథ: 

టిప్పు (విశ్వదేవ్ రాచకొండ) ఇంటర్లో ఆరు సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకుని.. తన స్నేహితులతో కలిసి పనీ పాటా లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఎప్పుడూ పిట్టగోడ మీద కూర్చుని కబుర్లు చెబుతూ కాలం గడిపేసే ఈ బ్యాచ్ అంటే వాళ్ల ఇంట్లో వాళ్లతో పాటు అందరికీ చులకనే. ఇలాంటి తరుణంలో వీళ్లుండే కాలనీకి దివ్య (పునర్ణవి) తన ఫ్యామిలీతో కలిసి వస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు టిప్పు. దివ్య తండ్రి.. టిప్పు తండ్రికి పై అధికారి కావడంతో వాళ్లింట్లో పనులన్నీ టిప్పు దగ్గరుండి చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఆమెకు టిప్పు ప్రపోజ్ చేయబోతే ఛీకొడుతుంది. తర్వాత అతడి మంచి తనం తెలుసుకుని ఫ్రెండుగా అంగీకరిస్తుంది. తర్వాత దవ్య కోసం చేసిన ఓ పని వల్ల టిప్పుతో పాటు అతడి స్నేహితులంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతకీ టిప్పు చేసిన ఆ పనేంటి.. దాని పర్యవసనాలేంటి.. చివరికి టిప్పుకు దివ్య దగ్గరైందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

రామ్మోహన్ నిర్మాణంలో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ చాలా సింపుల్ గా ఉండే కథాంశాలతో తెరకెక్కినవే. రియలిస్టిగ్గా.. మన చుట్టుపక్కల ఉండే మనుషుల జీవితాల్ని స్పృశిస్తూ.. సున్నితమైన అంశాలతో తెరకెక్కిన ఆ సినిమాలు మన ప్రేక్షకులకు ఈజీగా కనెక్టయ్యాయి. ఐతే ఎంత సింపుల్ స్టోరీలు ఎంచుకున్నా వాటిలో ఏదో ఒక బలమైన పాయింట్ ఉండేది. దాని వల్ల ఎమోషన్ మిస్సయ్యేది కాదు. కానీ రామ్మోహన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘తను నేను’లో అలాంటి పాయింట్ లేక తేలిపోయింది.

ఇప్పుడు ‘పిట్టగోడ’ దాంతో పోలిస్తే మెరుగ్గా అనిపిస్తుంది కానీ.. ఇందులో కూడా బలమైన పాయింట్ ఏమీ లేకపోయింది. సిచువేషనల్ కామెడీతో.. రియలిస్టిక్ సన్నివేశాలతో పండించిన వినోదం అక్కడక్కడా మెప్పిస్తుంది.. ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది కానీ.. రెండు గంటల సినిమాగా రూపుదిద్దుకునేంత బలమైన కంటెంట్ ఇందులో లేదు. ముఖ్యంగా ఎమోషనల్ హైస్ లేకపోవడం.. లవ్ స్టోరీలో అనుకున్నంత ఫీల్ కొరవడటం వల్ల కూడా ‘పిట్టగోడ’ మామూలు సినిమాలా కనిపిస్తుంది. కథను మలుపు తిప్పే అంశాలేవీ కూడా బలంగా.. పెద్ద స్థాయిలో లేకపోవడం వల్ల సీరియస్ గా ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేకపోయింది.

‘పిట్టగోడ’ను మొదలుపెట్టిన తీరు చూస్తే ఇందులో ఏదో ప్రత్యేకత ఉందనే అనిపిస్తుంది. హీరో స్నేహితుల పరిచయాలు భలే ఆసక్తికరంగా అనిపిస్తాయి. వీళ్ల పిట్టగోడ కబుర్లు కూడా బాగానే అనిపిస్తాయి. హీరోయిన్ తో హీరో పరిచయ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఐతే ఈ పరిచయాలయ్యాక కథ మలుపు తిరిగాల్సిన చోటే వీక్ అయిపోయింది. క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఎపిసోడ్ మీద అరగంటకు పైగా కథనాన్ని సాగదీయడంతో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ద్వితీయార్ధంలో హీరోకు హీరోయిన్ దగ్గరయ్యే సన్నివేశాలు దానికి ముందు వ్యవహారాలతో పోలిస్తే కొంచెం పర్వాలేదు కానీ.. ఆ ట్రాక్ కూడా మరీ ఆసక్తికరంగా ఏమీ ఉండదు. హీరోయిన్ గతానికి సంబంధించి ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లు.. ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ఇక క్లైమాక్సులో సినిమాకు కొంచెం సినిమాటిక్ ముగింపునిచ్చారు.

పంచ్ డైలాగులు లేకుండా.. సిచువేషనల్ కామెడీతో పండించిన వినోదం ‘పిట్టగోడ’కు ప్లస్ పాయింట్. హీరో అతడి స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాల్లో కొన్ని చోట్ల బాగానే నవ్వులు పండాయి. సహజమైన తెలంగాణ యాసతో కొన్ని పాత్రలు ఆకట్టుకుంటాయి. కానీ పాత్రధారులందరితోనూ ఒకే యాసను మాట్లాడించడంలో శ్రద్ధ పెట్టాల్సింది. ప్రధాన పాత్రధారుల సహజ నటన ఆకట్టుకుంటుంది. సాంకేతిక హంగులు కూడా బాగానే కుదిరాయి కానీ.. కథ మరీ సింపుల్ గా ఉండటం.. కథను ముందుకు నడిపించే బలమైన పాయింట్ ఏదీ కూడా సినిమాలో లేకపోవడం మైనస్. ఓవరాల్ గా ‘పిట్టగోడ’ అక్కడక్కడా కొంచెం ఆహ్లాదం పంచినా.. ప్రత్యేకమైన ముద్ర అయితే వేయదు.

నటీనటులు: 

విశ్వదేవ్ రాచకొండ.. పునర్ణవి హీరో హీరోయిన్లలా అనిపించరు. వాళ్లలో ఆ ఫీచర్లూ లేవు. అలాంటి బిల్డప్పులూ ఇవ్వలేదు. కథలో వాళ్లూ మామూలు పాత్రధారుల్లా కనిపిస్తారు. ఇద్దరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పునర్ణవి హావభావాలు మెప్పిస్తాయి. కొత్త కుర్రాడు విశ్వదేవ్ రాచకొండ బాడీ లాంగ్వేజ్.. నటన అన్నీ కూడా క్యాజువల్ గా అనిపిస్తాయి. హీరో స్నేహితులుగా ముగ్గురూ బాగా చేశారు. నవ్వించే బాధ్యతను పంచుకున్నారు. విలన్ పాత్రధారి ఓకే. ఆ పాత్రకు బిల్డప్ మరీ ఎక్కువైంది. మిగతా నటీనటుల్లో చాలామంది కొత్తవాళ్లే. పర్వాలేదనిపించారు.

సాంకేతికవర్గం: 

ప్రాణం కమలాకర్ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏమిటో ఇలా పాట వెంటాడుతుంది. పాటలు చాలా వరకు సందర్భానుసారంగా ఉంటాయి. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగ్గట్లుగా లేదు. కొన్ని చోట్ల ఫీల్ గుడ్ అనిపించినా.. కొన్నిచోట్ల లౌడ్ నెస్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా విలన్ పాత్రకు ఇచ్చిన ఆర్ఆర్ అతిగా అనిపిస్తుంది. ఉదయి ఛాయాగ్రహణం బాగుంది. సినిమాకు ఆకర్షణగా నిలిచింది. మాటలు సహజంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే. సహజమైన లొకేషన్లలో తక్కువ ఖర్చులో సినిమాను పూర్తి చేసిన సంగతి కనిపిస్తుంది. ఇక కొత్త దర్శకుడు అనుదీప్ నరేషన్ ఆకట్టుకుంది కానీ.. అతను ఎంచుకున్న కథలోనే బలం లేదు. రామ్మోహన్ స్క్రీన్ ప్లే కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు.

చివరగా: పిట్టగోడ.. మామూలు ముచ్చట్లే!

రేటింగ్ - 2.5/5

ఒక్కడొచ్చాడు

చిత్రం : ‘ఒక్కడొచ్చాడు’ 

నటీనటులు: విశాల్ - తమన్నా - జగపతిబాబు - సంతప్ - వడివేలు - సూరి తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: రిచర్డ్ నాథన్
నిర్మాత: హరి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సూరజ్

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ కు ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. కానీ మధ్యలో వరుస ఫ్లాపులతో తన మార్కెట్ ను దెబ్బ తీసుకున్నాడు. తిరిగి ఇక్కడ పాగా వేయడానికి కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. ఫలితం దక్కట్లేదు. తాజాగా ‘ఒక్కడొచ్చాడు’ సినిమాతో తన దండయాత్రను కొనసాగించాడు. మరి దీని సంగతేంటో చూద్దాం పదండి.

కథ: 

అర్జున్ (విశాల్) పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి.. సైకాలజీ స్టూడెంట్ అయిన దివ్య (తమన్నా)ను ప్రేమిస్తాడు. ఆమె డీసీపీ చంద్రబోస్ (జగపతిబాబు)కు చెల్లెలు. అర్జున్ కు కొన్ని పరీక్షలు పెట్టి ఆమెతో అతడి పెళ్లికి ఓకే చెబుతాడు చంద్రబోస్. ఐతే పెళ్లికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో అర్జున్.. చంద్రబోస్ కు పెద్ద షాకిస్తాడు. అతను నేరస్థుల నుంచి రికవర్ చేసిన వందల కోట్ల డబ్బును కొట్టేస్తాడు. అప్పుడే అర్జున్ లక్ష్యం వేరే అని తెలుస్తుంది. ఇంతకీ అర్జున్ ఎవరు.. అతడి మిషన్ ఏంటి.. కొట్టేసిన డబ్బుతో అతనేం చేస్తాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. తమిళం నుంచి వచ్చే కథలన్నీ కొత్తగా ఉంటాయని.. అవి కొత్త అనుభూతిని పంచుతాయని అనుకోకూడదు. అందుకు ‘ఒక్కడొచ్చాడు’ ఉదాహరణగా నిలుస్తుంది. ఇది మన తెలుగు సినిమాల్లో సహా అన్ని చోట్లా వాడి వాడి అరగదీసిన పాత కథతో తెరకెక్కిన సినిమా. పెద్దోడిని కొట్టు.. పేదోడికి పెట్టు అనే తరహా రాబిన్ హుడ్ కథనే ఆధునిక హంగులతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సూరజ్. హీరో ముందు అమాయకుడిలా పరిచయమవుతాడు. కానీ తర్వాత జగత్ కంత్రీలా డబ్బంతా దోచేస్తాడు. కొంచెం వెనక్కి హీరో ఎందుకలా చేస్తున్నాడో చూపించే ఒక శాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫార్మాట్లో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయో లెక్కల్లో చెప్పడం కష్టం.

కథ పాతదే అయినా కథనం ఏమైనా కొత్తగా.. ఎంటర్టైనింగ్గా ఉందా సర్దుకుపోదాం అంటే అదీ లేదు. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లుగా ఉంటుంది. కామెడీ సీన్లతో సహా అన్నిచోట్లా తర్వాత ఏం జరగబోతోందో సులువుగా చెప్పేయొచ్చు. హీరో కాబట్టి ఏమైనా చేసేస్తాడు. అవతల డీసీపీ అయినా సరే బోల్తా కొట్టక తప్పదు. నాకు మెమొరీ లాస్ అంటూ హీరో డీసీపీని ఆడేసుకుంటుంటాడు. హీరో ఆటలో అందరూ పావులు అయిపోతారు. ఇలా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో సాగిపోతుంది ‘ఒక్కడొచ్చాడు’ వ్యవహారం. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న నీ అంశం చుట్టూ కథ తిరగడం ఒక్కటే ‘ఒక్కడొచ్చాడు’లో కాంటెంపరరీగా అనిపించే అంశం.

ప్రథమార్ధంలో వచ్చే హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ ఏమంత ఆసక్తి కలిగించదు. తమన్నా గ్లామర్ విందు మినహా ఈ ట్రాక్ లో ఆకర్షించే అంశాలేమీ పెద్దగా ఉండవు. తమిళంలో తన వాయిస్ తో.. బాడీ లాంగ్వేజ్ తో కామెడీ పండించేస్తుంటాడు సూరి. కానీ తెలుగు ప్రేక్షకుల్ని కూడా అతను నవ్వించాలంటే సన్నివేశాల్లో బలం ఉండాలి. అది లేకపోవడంతో కామెడీ సీన్లేవీ పండలేదు. ప్రథమార్ధంలో కథ మొదలవడానికి చాలా సమయం పట్టేస్తుంది. ప్రి ఇంటర్వెల్ దగ్గర్నుంచే కొంచెం ఆసక్తి మొదలవుతుంది. తెలుగు కమర్షియల్ సినిమాల తరహాలో ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేశాడు దర్శకుడు. అది మరీ అంత సర్ప్రైజ్ ఏమీ కాదు కానీ.. ప్రేక్షకుడిలో ఇక్కడే కొంచెం చలనం వస్తుంది.

ఇక ద్వితీయార్ధం వచ్చేసరికి ఈ టెంపోను కొనసాగించలేకపోయాడు దర్శకుడు. మళ్లీ సినిమా రెగ్యులర్ ఫార్మాట్లో.. అనాసక్తికరంగా సాగుతుంది. ద్వితీయార్ధంలో వడివేలు కామెడీతోనూ అదే నేటివిటీ సమస్య ఇబ్బంది పెడుతుంది. అరవ జనాలకైనా ఈ కామెడీ నచ్చుతుందా అంటే సందేహమే. బ్రహ్మానందం డబ్బింగ్ కూడా ఈ పాత్రకు బలం కాలేకపోయింది. విశాల్ తనదైన స్టయిల్లో ఫైట్లు చేస్తూ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తూ సాగిపోతాడు. తమన్నా రెండో అర్ధంలో కనిపించేది చాలా తక్కువ. అసలామె పాత్రలో ఏ విశేషం లేదు. చివర్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం గుండె బరువెక్కిస్తాయి. ఐతే అంతకుముందు సినిమా సాగిన తీరుకు.. చివర్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కు పొంతన కుదరదు. మొదట్నుంచి సిల్లీగా సాగిన సినిమా.. చివరికి వచ్చేసరికి సీరియస్ టర్న్ తీసుకుంటే ఎలా సింక్ అవుతుంది? విశాల్ ఫైట్లు.. తమన్నా గ్లామర్.. రిచ్ విజువల్స్ మాత్రమే ‘ఒక్కడొచ్చాడు’లో చెప్పుకోదగ్గ పాజిటివ్స్. ఈ పరమ రొటీన్ కమర్షియల్ సినిమాలో అంతకుమించేం లేదు.

నటీనటులు: 

విశాల్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం అందంగా.. స్టైల్ గా కనిపించాడు. స్టైలింగ్ అదీ బాగుంది. ఎప్పట్లాగే ఫైట్లు బాగా చేశాడు. నటన పరంగా అతడికి సవాలు విసిరే పాత్రేమీ కాదిది. క్యారెక్టర్ మరీ రొటీన్. తమన్నా జస్ట్ పాటల కోసమే సినిమాలో ఉన్నట్లుంది. నటన పరంగా ఆమెకు ఎలాంటి స్కోప్ లేదు. ఐతే తన అందచందాలతో తమన్నా అలరించింది. జగపతి బాబు పాత్ర కూడా ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. ఆయన ఉన్నంతలో తనవంతుగా సినిమాను నిలబెట్టడానికి కొంత ప్రయత్నం చేశారు. సూరి.. వడివేలుల గురించి చెప్పడానికేమీ లేదు. సంపత్.. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం: 

‘ధృవ’తో ఆకట్టుకున్న హిప్ హాప్ తమిళ కంటెంటుకు తగ్గట్లే మ్యూజిక్ అన్నట్లుగా ఔట్ పుట్ ఇచ్చారు. పాటలు పర్వాలేదు. మ్యూజిక్ ఓకే అనిపించినా.. లిరిక్స్ క్యాచీగా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. రిచర్డ్ నాథన్ ఛాయాగ్రహణం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఛేజ్ సీన్స్.. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. సినిమా అంతటా విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సూరజ్.. ఇటు తెలుగులో.. అటు తమిళంలో వచ్చిన అనేకానేక మాస్ మసాలా సినిమాలన్నింటినీ చూసి ఈ కథాకథనాల్ని తయారు చేసినట్లున్నాడు. ఎక్కడా కూడా కొత్తదనం లేదు. దర్శకుడి ముద్రా కనిపించలేదు.

చివరగా: ఒక్కడొచ్చాడు.. ‘రొటీన్’గా వాయించేస్తాడు

రేటింగ్- 2/5

జర్నలిస్ట్ గా నయన్.. వరల్డ్ టూర్

సౌత్ బ్యూటీ నయనతార తన సినిమాల ఎంపిక విషయంలో చూపించే బ్రిలియన్స్ కి అందరూ షాక్ తినేస్తూ ఉంటారు. అటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు.. ఇటు పక్కా కమర్షియల్ సినిమాలు కూడా చేసి మెప్పించేస్తూ ఉంటుంది. తాజాగా భరత్ కృష్ణమాచారి అనే కొత్త డైరెక్టర్ తో సినిమాకు సైన్ చేసింది నయన్. మిస్కిన్ మూవీకి సౌండ్ ఇంజినీర్ గా వర్క్ చేసిన ఇతను.. ఓ సూపర్బ్ లైన్ చెప్పి నయన్ మూవీతో డైరెక్టర్ అయిపోతున్నాడు.

ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీ మార్చ్ లో మొదలు కానుండగా.. ఫ్రాన్స్.. జర్మనీ.. చెక్ రిపబ్లిక్.. పొలండ్.. మంగోలియాలతో పాటు.. ఇండియాలో కూడా షూట్ చేయనున్నారట. 'ఫ్రాన్స్ లో జర్నలిస్ట్ గా పని చేసే నయన్ పాత్ర.. తన పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడానికి అనేక దేశాలు తిరగాల్సి వస్తుంది. చివరకు తమిళనాడుతో ఆమె ప్రయాణం ముగుస్తుంది. సినిమాలో 75 శాతం విదేశాల్లోనే షూటింగ్ జరగనుండగా.. ఎక్కువగా కొండలు.. మంచు ప్రాంతాల్లో షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నయనతారకు అద్భుతంగా నచ్చడంతో ఆమె వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకుంది' అని చెప్పాడు దర్శకుడు. 

ఈ సినిమాకోసం నయనతార పలు యాక్షన్ సన్నివేశాలు కూడా చేయాల్సి ఉండడంతో.. ఇందుకోసం ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేసిందట. 

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses